ప్రళయ వేగంతో ప్రవహించే ప్రతి నదీ ఒకప్పుడు పిల్ల కాలువే!
ఇప్పుడున్న దాని గంభీర రూపం ఎన్నో అడ్డంకుల్ని అధిగమించిన ఆత్మవిశ్వాసం, అలుపెరగని సుదూర ప్రయాణం వల్ల వచ్చిందే!

Friday, September 28, 2007

పరవశం

నీ నుదుట సింధూరాన్ని చూసినప్పుడల్లా
జాబిల్లిని సూరీడు ముద్దాడినట్టే అనిపిస్తుంది!
లేత బుగ్గల్ని తాకగానే
గులాబిరెమ్మల నునుపుదనం గుర్తొస్తుంది!

మకరందాల మందారం వికసించిందా అన్నట్లు
నీ నవ్వు ప్రతిసారీ పరవశింపజేస్తుంది!

ఏంటా మాయ

నిజం చెప్పు! చెప్పవూ... దాస్తున్నావు కదూ! లేదంటే, నీకు చెప్పాలని పెదాల దాకా వచ్చిన మాట నువ్వలా చూడగానే పాదాలవరకూ వెళ్ళి పోవడమేంటి?

నీ చూపు సోకగానే అంతవరకూ మామూలుగానే ఉన్న నా గుండె వేగం అంతలా పెరిగిపోవటమేంటి? ఏయ్ చెప్పు...

అని దబాయించి అడగాలనుంది! అడగగలనంటావా?

తీయని గాయం

కాలం ఎంతటి గాయాలనైనా మానుస్తుందట!

నీ వల్ల, నీ కోసం...

నువ్వు చేస్తే అయిన ఈ తీయని గాయాలు

మానకుండా ఉండటానికి

ఈ కాలం జరగకుండా ఉంటే ఎంత బాగుణ్ణు!

ఆ రోజు...

నేను చాలా సార్లు మారాలనుకునే వాన్ని. ఈ రోజు నుంచి మారిపోయి, చాలా కష్టపడి ఏదేదో సాధించాలి అనుకునే వాన్ని. అందుకోసం ఈ రోజు నుంచి స్టార్ట్ అని డేట్ కూడా నిర్ణయించుకునే వాన్ని. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది. అలా నవ్వొచ్చినప్పుడే ఇలా పిచ్చిగా గీకేశాను. చదివితే మీకూ నవ్వొస్తుంది.
*** *** ***
ఒక్కోసారి హఠాత్తుగా మన జీవితంలోకి ఓ రోజు వచ్చిపడుతుంది. ఆ రోజు మనలో ఒక కొత్త చైతన్యం, ఓ కొత్త శక్తి... తెస్తుంది. నిజం! ఆ రోజంతా నూతనత్వం నిండిపోతుంది.

ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అంతకుముందున్న జీవితం అంతా ఒక్కసారే మార్చేయాలనిపిస్తుంది. ప్రణాలికలు ఉదయిస్తాయి, పట్టుదలలూ పెరుగుతాయి. కానీ, చిత్రం... ఆ రోజు మరుసటి రోజుని తనలో కలుపుకోదెందుకో! ఆ కొత్తదనం తెల్లవారితే మాయమవుతుందేమిటో?

నిజంగా ఆ మొదటి రోజుకీ, రెండో రోజుకీ ఎంత తేడా! ఆ రెండో రోజు మళ్ళీ గత జీవితాన్ని ముందుకు తెస్తుంది. మార్పు అంత సులభ సాధ్యం కాదు నాయనా అంటుంది. మళ్ళీ మామూలు జీవితంలోకి, నడుస్తున్న చట్రంలోకి ఇరికిస్తుంది.

ఈ రెండో రోజు కాలిపోనూ, కూలిపోనూ! ఎందుకొస్తుందో....నా జీవితమంతా ఆ మొదటి రోజే ఉంటే ఎంత బాగుణ్ణో! ఎన్ని విజయాలు వరించేనో! నా వాళ్ళ మొహాల్లో ఎన్ని సంతోషపు జ్యోతులు వెలిగిస్తానో! ఎన్నెన్ని శిఖరాలు అధిరోహిస్తానో! ప్చ్...
అవునూ... ఈ చైతన్యం, ఈ శక్తి, ఈ నూతనోత్సాహం ఆ రోజులో ఉందా? లేక ఎక్కడో, ఏ మూలనో దాక్కొని నాలోనే ఉందా?మరి ఆ రోజే ఎందుకొచ్చిందంటావ్? నాలో లేనిది ఎక్కడనుండి పుట్టుకొస్తుంది?
అయితే, మొత్తానికి నాలోనే ఉందన్న మాట!
తీస్తా, వెలికి తీస్తా... విజయం సాధిస్తా

మానస నేస్తం

చీకటి పారిపోవడం చూసాను. వెన్నెల నిండిపోవడమూ చూసాను. చల్ల గాలి తాకిపోవడం చూసాను. స్వేదమే సర్వమై తడిసిపోవడమూ చూశాను.

ఎన్ని అనుభవాలని, ఎన్ని ఆనందాలని, అలా ఎన్నెన్ని రోజులని... ఇట్టే గడిచిపోయాయి కదూ!

నిజం! నువ్వు పక్కనుంటే... ఈ గాలీ వానా, ఈ చీకటీ వెన్నెలా ఏవైనా వచ్చినట్టు తెలిసేదా? అదంతా ఆ క్షణమే నిలిచిన ఓ భౌతిక భావనే గానీ మనసంతా నీవేగా...!

యువరాణి

పరిమళాల సిరిమల్లి, వికసించిన విరి లిల్లి
తటాకంలో తామర, కన్నె జడలో గులాబి

మాయ చేసే మందారం, సిగ్గుపడే సిందూరం

విరబూసిన చామంతి, ముడుచుకున్న ముద్దబంతి
రంగురంగుల గన్నేరు, పల్లె పడుచు తంగేడు

ఈ పూలన్నీ
సుమ సామ్రాజ్యానికి ప్రతినిధులయితే
నా కనుల కొలనులో విరిసిన ఆ కలువ జ్యోతి
వాటికి యువరాణేమో!!!

నీ కోసం

కరుణించి నీ మనసు వరమిస్తానంటే

ఊపిరినే మరచి ప్రేమ తపస్సు చేస్తా!

ఎన్ని యుగాల తర్వాతనైనా నాతో జీవిస్తానంటే

అది నరకానికైనా నీతోనే వస్తా!

నీవు కోరుకుంటే పారిజాతమైనా

నా ప్రాణాల్ని బదులిచ్చి పదిలంగా తెస్తా!