ప్రళయ వేగంతో ప్రవహించే ప్రతి నదీ ఒకప్పుడు పిల్ల కాలువే!
ఇప్పుడున్న దాని గంభీర రూపం ఎన్నో అడ్డంకుల్ని అధిగమించిన ఆత్మవిశ్వాసం, అలుపెరగని సుదూర ప్రయాణం వల్ల వచ్చిందే!

Friday, September 28, 2007

ఆ రోజు...

నేను చాలా సార్లు మారాలనుకునే వాన్ని. ఈ రోజు నుంచి మారిపోయి, చాలా కష్టపడి ఏదేదో సాధించాలి అనుకునే వాన్ని. అందుకోసం ఈ రోజు నుంచి స్టార్ట్ అని డేట్ కూడా నిర్ణయించుకునే వాన్ని. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది. అలా నవ్వొచ్చినప్పుడే ఇలా పిచ్చిగా గీకేశాను. చదివితే మీకూ నవ్వొస్తుంది.
*** *** ***
ఒక్కోసారి హఠాత్తుగా మన జీవితంలోకి ఓ రోజు వచ్చిపడుతుంది. ఆ రోజు మనలో ఒక కొత్త చైతన్యం, ఓ కొత్త శక్తి... తెస్తుంది. నిజం! ఆ రోజంతా నూతనత్వం నిండిపోతుంది.

ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అంతకుముందున్న జీవితం అంతా ఒక్కసారే మార్చేయాలనిపిస్తుంది. ప్రణాలికలు ఉదయిస్తాయి, పట్టుదలలూ పెరుగుతాయి. కానీ, చిత్రం... ఆ రోజు మరుసటి రోజుని తనలో కలుపుకోదెందుకో! ఆ కొత్తదనం తెల్లవారితే మాయమవుతుందేమిటో?

నిజంగా ఆ మొదటి రోజుకీ, రెండో రోజుకీ ఎంత తేడా! ఆ రెండో రోజు మళ్ళీ గత జీవితాన్ని ముందుకు తెస్తుంది. మార్పు అంత సులభ సాధ్యం కాదు నాయనా అంటుంది. మళ్ళీ మామూలు జీవితంలోకి, నడుస్తున్న చట్రంలోకి ఇరికిస్తుంది.

ఈ రెండో రోజు కాలిపోనూ, కూలిపోనూ! ఎందుకొస్తుందో....నా జీవితమంతా ఆ మొదటి రోజే ఉంటే ఎంత బాగుణ్ణో! ఎన్ని విజయాలు వరించేనో! నా వాళ్ళ మొహాల్లో ఎన్ని సంతోషపు జ్యోతులు వెలిగిస్తానో! ఎన్నెన్ని శిఖరాలు అధిరోహిస్తానో! ప్చ్...
అవునూ... ఈ చైతన్యం, ఈ శక్తి, ఈ నూతనోత్సాహం ఆ రోజులో ఉందా? లేక ఎక్కడో, ఏ మూలనో దాక్కొని నాలోనే ఉందా?మరి ఆ రోజే ఎందుకొచ్చిందంటావ్? నాలో లేనిది ఎక్కడనుండి పుట్టుకొస్తుంది?
అయితే, మొత్తానికి నాలోనే ఉందన్న మాట!
తీస్తా, వెలికి తీస్తా... విజయం సాధిస్తా

No comments: